మన న్యూస్ సింగరాయకొండ:-
– సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి మరియు సింగరాయకొండ రైతు సేవా కేంద్రాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ. నిర్మల కుమారి మాట్లాడుతూ, రైతు సోదరులు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి శ్రీ టి. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, రసాయనిక ఎరువుల బదులు సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల నేల ఆరోగ్యం మెరుగవుతుందని, సాగు ఖర్చు తగ్గి లాభం పెరుగుతుందని తెలిపారు. వరి పంటలో సస్యరక్షణ చర్యలు, ఎరువుల వినియోగం, వ్యవస్థాపిత యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు.అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మినుము మరియు నువ్వు పంటలకు ఈనెల 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్, గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రియాంక, సాజిద్, స్థానిక రైతులు పాల్గొన్నారు.