
మన న్యూస్:తిరుపతి, నవంబర్ 26
వచ్చే ఏడాది మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ రథయాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్ వెల్లడించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్త రూప, రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు ల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ భావజాలాలను పెంపొందించే దిశగా, ఆధ్యాత్మికతను సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలనే సంకల్పంతో శ్రీరామరథయాత్రను శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి అయోధ్యకు చేరేటట్లు మార్గ నిర్దేశకాలను గురించి చర్చించినట్లు తెలిపారు. ఈ రథయాత్ర ప్రారంభోత్సవానికి యూపీ ముఖ్యమంత్రివర్యులు యోగి ఆదిత్యనాథ్ లతోపాటు ఇతర ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు వారు తెలిపారు. రథయాత్ర సాధ్యసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలను చేపట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల లెజెండరీలను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశం హిందూ సామ్రాజ్యంలో రామరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అన్ని రాష్ట్రాలలో ప్రతినిధులను నియమించి వారికి బాధ్యతలను అప్పగించి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు హాజరైనట్లు వారు తెలిపారు. శ్రీరామరథయాత్ర విజయవంతనికి త్వరలో తిరుపతిలో జాతీయస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
