తిరుపతి,మన న్యూస్ , జూలై 3, 2025 :- ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా, అమర రాజా గ్రూప్ మరోసారి తమ నిబద్ధతను చాటుకుంది. సంస్థ ప్రధాన కార్యాలయం కరకంబాడిలో “మీ నంబర్లు తెలుసుకోండి, మీ ఆరోగ్యాన్ని తెలుసుకోండి” అనే థీమ్‌తో వార్షిక వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని అమరా హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గౌరీనేని, అమర రాజా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. చంద్రబాబు, చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ ప్రశాంత్ తివారి తదితర సీనియర్ లీడర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి గౌరీనేని మాట్లాడుతూ, "ఉద్యోగుల ఆరోగ్యాన్ని అమర రాజా ఎప్పుడూ బాధ్యతగా తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం వార్షిక వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన సలహాలు ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆరోగ్యపరంగా చురుకుగా ఉండగలుగుతారు. వ్యాయామం, సరైన ఆహారం వంటి అలవాట్లు ఉద్యోగులకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి," అని పేర్కొన్నారు. ఈ AME కార్యక్రమంలో ఉద్యోగులకు సంపూర్ణ వైద్య పరీక్షలు, గుండె సంబంధిత రిస్క్ గుర్తింపు, జీవనశైలి మార్గదర్శకాలు, అనుసరణ పరీక్షలు చేయనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా "విటాలిటీ ఇండెక్స్" అనే టూల్ ప్రవేశపెట్టారు. ఇది నాలుగు ప్రధాన శారీరక ప్రమాణాల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్య స్థితిని వార్షికంగా అంచనా వేస్తుంది. అమర రాజా గ్రూప్ తమ ఉద్యోగుల ఆరోగ్యంపై చూపుతున్న ఈ చొరవ ఇతర కార్పొరేట్ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది.