మన న్యూస్ సాలూరు జూన్ 17:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం దర్తి అబ జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA) అభయాన్ సదస్సుకు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దర్తి అబ జన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ పథకం గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం 2024 అక్టోబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ పథకం ఐదేళ్లపాటు ఉంటుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 155 గ్రామాలు ఎంపిక చేసి, అక్కడ నివసించే గిరిజనులకు జీవనోపాధి కల్పించి ఆర్థిక సాధికారత వంటి కీలక రంగాల్లో చర్యలు చేపడతామన్నారు. ఈ పథకం జూన్ 15 నుండి 30వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గిరిజనులకు 14 ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏపీఓ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్, ఆ గ్రామ సర్పంచ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.