మన న్యూస్, నాయుడుపేట :రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు పనిచేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. మంగళవారం నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సూళ్లూరుపేట నియోజకవర్గం లోని మేనకూరు,మాంబట్టు, శ్రీ సిటీ సెజ్ లలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమల యాజమాన్యాలకు ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా దేశ, విదేశాలకు చెందిన పలు పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నారని తెలియజేశారు.అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.