మన న్యూస్,నెల్లూరు:- అసలే నిరుపేద కుటుంబం. రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.చిన్న అంగడి పెట్టుకొని కాపురాన్ని నెట్టుకొస్తున్న తల్లికి కూతురి చదువు భారంగా మారిన పరిస్థితులలో విపిఆర్ ఫౌండేషన్ ఆపన్న హస్తం అందించి 50 వేల ఆర్ధిక సహాయం అందించింది. నెల్లూరు నగర శివార్లలోని కనుపర్తిపాడు సమీపంలోని ఇందిరమ్మ కాలానికి చెందిన పి గాయత్రి విపిఆర్ విద్యా సంస్థలో 10 వ తరగతిలో 587 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. తండ్రి కృష్ణారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పై చదువులు చదివించాలన్నా వేలకు వేలు ఫీజులు చెల్లించే ఆర్ధిక స్తొమత తల్లి ఝాన్సీకి లేదు. 10 వ తరగతి వరకు ఉచిత విద్య అందించిన విపిఆర్ ఫౌండేషన్ ద్వారానే ఇంటర్మీడియట్ చదువుకు ఆర్ధిక సహాయం ఆశించి తన కుమార్తెను చదివించలేని తన దయనీయ పరిస్థితిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని కలిసి చెప్పుకుంది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హరనాధ్ పురం నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటానన్న విద్యార్థిని గాయత్రికి ఫీజు ఖర్చులకు గాను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 50 వేల చెక్కు అందించారు. 10 తరగతి వరకు ఉచితంగా చదివించిన విపిఆర్ ఫౌండేషన్ పై చదువులకు కూడా ఆర్ధిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన కుమార్తె చదువులకు 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి విద్యార్థిని గాయత్రి ఆమె తల్లి ఘాన్సీ కృతజ్ఞతలు తెలిపారు.
