Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి :- మన న్యూస్..శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తెలుస్తామని తహసిల్దారు లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలనీలో చోటు చేసుకున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలలో 54 బృందాలుగా ఏర్పడి సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సర్వే సందర్భంగా రాజీవ్ నగర్లో 6,300 ఇళ్ల స్థలాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా2వేల మందికి పైగా పట్టాలు పొంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదన్నారు. రికార్డులను సర్వే అనంతరం సమగ్రంగా పరిశీలించి ఆ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ స్థలాలు ఆక్రమణకు గురైనా..నిర్మాణ పనులు చేపకట్టకపోయినా.. వివరాలను ఈనెల 30వ తేదీ ఆఖరి గడువు లోపల సమర్పించాలని కోరారు. లేనిపక్షంలో అనర్హత వేటు వేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధికారులకు సహకరించి తమ స్థలాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ వివరాలకు సేకరణకు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.