శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్):
ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రాయితీ రుణాల మంజూరుతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం వెలుగు స్త్రీ శక్తి భవనం లో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ బి. జి. ఆర్. నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రోత్సాహకరమైన విధానాలతో వ్యవసాయ రంగానికి తోడ్పడుతోందని, రైతులు మరియు మహిళా సంఘాలు అందుబాటులో ఉన్న రాయితీ రుణాలను వినియోగించుకోవాలని సూచించారు.
డిఆర్డిఏ డిపిఇం కాకినాడ పద్మావతి మాట్లాడుతూ, ఈ రుణాలు రైతుల ఉపాధి మెరుగుదలకే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు దోహదపడతాయని అన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం సమర్థవంతమైన బ్యాంకింగ్ సేవల అవసరాన్ని ఆమె ఉల్లేఖించారు.
ఎపిఎం ప్రత్తిపాడు వై. వెంకట్రావు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబిగా మారేందుకు ప్రభుత్వం రుణాలతో పాటు శిక్షణ కార్యక్రమాలను కూడా అందిస్తోంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా పీఎం సురక్ష బీమా యోజన (PM-SBY), పీఎం జీవిన్ జ్యోతి బీమా యోజన (PM-JJBY), సుకన్య సమృద్ధి యోజన (SSY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి ప్రభుత్వ ఇన్సూరెన్స్ మరియు పొదుపు పథకాలపై అధికారులు సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా అర్హులైన రైతులు మరియు మహిళా సంఘాల సభ్యులకు రుణ మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. స్థానిక ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకొని తమ జీవనోపాధిని అభివృద్ధి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ కే వెంకటేశ్వర్లు, వివిధ బ్రాంచ్ మేనేజర్లు,ఎస్ ఎస్ టి సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు వై వెంకట్,సిహెచ్ ప్రసాద్,ఆర్ నానాజీ తదితరులు పాల్గొన్నారు.