Mana News:- తిరుపతి, నవంబర్ 20, మన న్యూస్:- తిరుమల బాలాజీ నగర్ లో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు స్లాబ్ వేయించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. అసెంబ్లీ లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి హయంలో బాలాజీ నగర్ వాసులకు ఇళ్ల స్లాబ్ వేయిస్తా మని హామీ ఇచ్చి కొన్ని ఇళ్లకు తన హయంలో వేయించారని ఆయన చెప్పారు. బాలాజీ నగర్ లో1136 ఇళ్లు ఉంటే ఇప్పటి వరకు 538 ఇళ్లకు మాత్రమే స్లాబ్ వేశారని మిగిలిన వాటికి స్లాబ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఆయన కోరారు. కాగా తిరుపతివాసులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టిటిడి పాలకమండలి పునరుద్ధరించడం పట్ల సిఎం, డిప్యూటీ సీఎం, టిటిడి చైర్మన్ లకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా శ్రీవారి దర్శన టికెట్స్ అమ్ముకుని స్థానికులకు ఆన్న దర్శన వెసులుబాటును రద్దు చేసిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఫ్లై ఓవర్ పేరు గరుడ వారధిగా తిరిగి పెట్టడం శుభపరిణామం అని ఆయన అన్నారు. కాగా తిరుపతిని గంజాయిరహిత నగరంగా తీర్చిదిద్దతామన్న హామీ పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లని ఆయన కోరారు. గత ప్రభుత్వం లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. టిడిఆర్ బాండ్ల జారిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఆయన కోరారు.