మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మద్నూర్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య ను నియోజకవర్గ నాయకులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లను ఎంపిక చేసిన విధానాన్ని గురించి మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్వ్యూ పద్ధతిలో మార్కెట్ కమిటీ చైర్మన్ లను ఎంపిక చేశామని తెలిపారు. స్థానిక మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకుల సమక్షంలో ఆశావాహులందరిని విడి విడిగా కొన్ని ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశామని గుర్తు చేశారు. ఎవరైతే సరైన సమాధానాలు చెప్పి ఎక్కువ మార్కులు సాధించారో వారినే చైర్మన్ గా ఎంపిక చేశామని మంత్రికి వివరించారు. జుక్కల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని చెప్పారు. ఆ విధంగా ఎంపికైన మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్యను మంత్రి ని పరిచయం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన సౌజన్య ఉన్నత విద్యావంతురాలు అని, ఇంటర్వ్యూ విధానాన్ని అమలు చేసినందకు ఈ పదవికి అర్హత సాధించిందని చెప్పారు. నూతన విధానంలో ఏఎంసి చైర్మన్ ల ఎంపిక చేపట్టిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన సౌజన్య శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంటా సీనియర్ నాయకులు తదితరులున్నారు.