మన న్యూస్, నెల్లూరు ,మే 18:అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొడతామని చెప్పిమరీ ముష్కరుల పీచమణిచిన భారత ప్రధానికి, సైన్యానికి దేశప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు.ఆదివారం నెల్లూరు నగరంలో వేలాది మంది ప్రజలు మనం సైతం దేశం కోసం అంటూ జాతీయ పతాకాలు చేతబూని భారత్ మాతాకీ జై అని నినదిస్తూ వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ విగ్రహం వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి పార్టీల నాయకులు తోడుగా యువకులు, విద్యార్థులు, మాజీ సైనికులు, వివిధ వర్గాల ప్రజలు వేయి అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. వందేమాతరం నినాదంతో వి ఆర్ సి సెంటర్ మార్మోగింది. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ......26 మంది అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొడతామని ఆ రోజే భారత ప్రధాని చెప్పినట్లుగానే అతి తక్కువ సమయంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన భారత సైన్యం పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతుగా నిలిచే వారికి సరైన గుణపాఠం నేర్పిందన్నారు. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన త్రివిధ దళాల జవానులు అనిర్విచనీయమైన విజయం సాధించారని కొనియాడారు. అలాగే భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలపాలని కృషి చేస్తున్న భారత ప్రధానికి ఉగ్రవాదంపై పోరులో ప్రపంచంలోని అన్ని దేశాలు సంఘీభావం తెలిపాయన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను భారత ప్రజలందరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలియజేస్తూ వారికి ఘన నివాళి అర్పించారు.నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ...... భారతదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, తనుకు తానుగా మరొకరి జోలికి వెళ్ళదని, కానీ తమ జోలికి వస్తే తాట తీస్తామని భారత సైన్యం నిరూపించిందన్నారు.ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ .......భారతదేశం శాంతికాముక దేశమని చేసిన చరిత్ర ఎన్నడూ లేదన్నారు. సమయంలో విధ్వంసాలకు చిరునామాగా పాకిస్తాన్ మిగిలిపోయింది అన్నారు. భారత సైనిక శక్తి ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలిసిందన్నారు.తిరంగా ర్యాలీలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి ,జిల్లా సైనిక సంక్షేమ అధికారి హరికృష్ణ, మాజీ సైనికోద్యోగులు శ్యాంప్రసాద్, కళాధర్, రత్నయ్య, కూటమి నేతలు నూనె మల్లికార్జున్ యాదవ్, గనుకుల కిషోర్, అశేష ప్రజలు పాల్గొన్నారు.