మన న్యూస్, కావలి ,మే 17:నెల్లూరు జిల్లా కావలికి చెందిన కుమారి తొట్టెంపూడి కావ్య శుక్రవారం బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ( గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ) నుండి డాక్టరేట్ అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కావ్య, జన్యుశాస్త్రం మరియు మొక్కలపెంపకం విభాగంలో డాక్టరేట్ ను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ నుండి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు యన్ చలువరాయస్వామి, వైస్ ఛాన్సెలర్ డాక్టర్ యస్ వి సురేఖ, ఇఫ్కో మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ యు యస్ అవస్తి, డీన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ డాక్టర్ కె సి నారాయణ స్వామి పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, రైతుల సంక్షేమానికి కృషి చేయడమే లక్షంగా, ఈ రంగంలో డాక్టరేట్ పొందానని కుమారి తొట్టెంపూడి కావ్య ఈ సందర్బంగా పేర్కొన్నారు. తన తండ్రి, అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ లో వస్త్రవ్యాపారం చేస్తున్న, తొట్టెంపూడి ప్రసాదరావు భారతీయ మజ్దూర్ సంఘ్ ( బియంయస్ ) జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర నాయకుడిగా 4 దశాబ్దాల పాటు కార్మిక సంక్షేమం కోసం పనిచేసారని, తన తాతయ్య జి జయరామయ్య ప్రకాశం జిల్లాలో విద్యావేత్తగా, పలు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారని అన్నారు. వారి ఆకాంక్ష మేరకు తాను సాఫ్ట్వేర్ రంగం లేదా వైద్య రంగాన్ని కాదనుకుని వ్యవసాయ శాస్త్రవేత్తగా రైతులకు, వ్యవసాయ రంగానికి తనవంతు సహకారం అందించాలని ఈ రంగాన్ని ఎంచుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం బాపట్లలోని యన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ అసోసియేట్ గా పనిచేస్తున్నానని, మరింత మంది వ్యవసాయ శాస్త్రవేత్తలను దేశానికీ అందించడమే తన లక్ష్యం అని అన్నారు. తన లక్ష్యసాధనకు సహకరించిన అధ్యాపకులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేసారు.