శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయ అధికారిని మొండి వైఖరి నశించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ ద్వజమెత్తారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రామకృష్ణాపురం ఎం. పద్మ అంగన్వాడీ కార్యకర్త అక్రమ తొలగింపు పై శనివారం మధ్యాహ్నం శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. సిడిపిఓ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు పలుకుతూ అంగన్వాడీ కార్యకర్తను విధుల్లోనికి తీసుకోకపోతే జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ తరపున ఉద్యమం మరింత తీవ్రతకు దారితీస్తుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి హెల్పర్స్ మరియు వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ మాట్లాడుతూ, పది సంవత్సరాలు పైన సేవలందించిన అంగన్వాడి కార్యకర్త ను అక్రమంగా తొలగించడం సరికాదని, తొలగించాలంటే నిబంధనలు ప్రకారం మూడుసార్లు నోటీసులు ఇచ్చి పంచనామా చేసి తొలగించాలని అన్నారు. అంగన్వాడి కార్యకర్త వేసవి సెలవులకు బంధువుల ఇంటికి వెళ్ళగా అంగన్వాడీ కార్యకర్త చేతికి నోటీసు అందించకుండా అంగన్వాడి కార్యకర్త లేదని సిడిపిఓ కి తెలియజేయగా నోటీసును అంగన్వాడీ కార్యకర్త ఇంటికి అంటించమని తెలియజేసినట్లు రౌతులపూడి ప్రాజెక్ట్ సూపర్వైజర్ జానకి తెలిపారని, అంగన్వాడి కార్యకర్త ఎం. పద్మ ను తొలగించినట్లు తెలపకుండానే భవాని అనే ఆమెను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఉన్నత అధికారులతో చేతులు కలిపి అక్రమంగా ఆమెను తొలగించారని ఆరోపించారు. రామకృష్ణాపురంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి కార్యకర్త ఎమ్. పద్మ కు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని, లేనియెడల జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలకు సహాయ కార్యకర్తలకు పిలుపునిచ్చి ధర్నాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బి రత్నకుమారి, ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ, ఎమ్ .సత్యవేణి, సీత, బి. అప్పలరాజు,నూకరత్నం తదితర అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి సహాయ కార్యకర్తలు పాల్గొన్నారు.