మన న్యూస్ సాలూరు మే 15:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఈనెల 18,19,20 తేదీలలో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగకు మున్సిపల్ పాలకవర్గం సహకరించడం లేదని మంత్రి సంధ్యారాణి వారి తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చిందన్నారు. గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పండుగ సందర్భంగా త్రాగునీటి కోసం నిధులు తీసుకొచ్చినా పాలకవర్గం సహకరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైనా పండుగకు రాజకీయ రంగులు పులమాలని చూస్తే అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల పండుగను నిర్వహించలేకపోయారన్నారు. పండుగ ఏర్పాట్లకై ప్రత్యేక నిధులు తీసుకొచ్చి పట్టణంలో సీసీ కెమెరాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ ఆదివారం నుండి ఉయ్యాల కంబాలతో ప్రారంభించి పండుగను అంగరంగ వైభవంగా జరిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు అక్యాన అప్పారావు, కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్, మాజీ కౌన్సిలర్లు పప్పల మోహన్రావు, కొనిసి చిన్ని, బృందావనం అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.