మన న్యూస్, తిరుపతి:తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు లు సారె సమర్పించారు. మే 06 తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లారు. అంతకుముందు శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను తిరుపతి ఎమ్మెల్యే ఎ. శ్రీనివాసులు కు టిటిడి ఛైర్మన్ , టిటిడి ఈవో అందజేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి అని, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని తెలిపారు. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించేలా అపురూపంగా జాతర జరుగుతుందని చెప్పారు. టిటిడి నిధులతో తాతయ్య గుంట గంగమ్మ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందిస్తామన్నారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, ప్రతి ఏటా చైత్ర మాసంలో జాతర సందర్భంగా నాలుగో రోజున అమ్మవారికి టిటిడి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రూ. 60 లక్షలతో గంగమ్మ జాతరకు ఏర్పాట్లు చేశామని, రూ.3.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారని తెలిపారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ పార్థసారధిస్వామి, శ్రీగోదాదేవి, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని టిటిడి ఈవో దర్శించుకున్నారు. ముందుగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు దంపతులు, టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు దంపతులు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు వి.ఆర్.శాంతి, లోకనాధం, విజివో సదాలక్ష్మి, ఏఈవో ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ లు శ్రీ చిరంజీవి, శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఏవీఎస్వో సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.