మన న్యూస్ సాలూరు మే 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం దుగ్ద సాగరం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా గురువారం నాడు బైపాస్ రోడ్ లో ఉన్న దుగ్ద సాగరం వద్ద రూరల్ ఎస్సై నరసింహమూర్తి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుండి ఆంధ్ర మీదుగా OD 02AC 3129 నెంబర్ గల కారు అతివేగంగా వెళ్లడం గుర్తించామన్నారు. తీరా ఆ కారు దగ్గరికి వెళ్లేసరికి పోలీసులను చూసి లోపల ఉండే ఇద్దరు వ్యక్తులు కారు దిగి పరారయ్యారన్నారు.అనుమానంతో కారుని తనిఖీ చేస్తుండగా 86 గంజాయి ప్యాకెట్లు కారులో ఉన్నాయన్నారు. వాటి బరువు 183.800 కేజీలు ఉందన్నారు. ఆ వాహనం ఒడిస్సా రాష్ట్రం సునాబేడ చెందిన నిరుపమా జన పేరుతో ఉందన్నారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 10 లక్షలు వరకు ఉంటుందని రూరల్ సిఐ రామకృష్ణ తెలిపారు . అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.