మన న్యూస్,తిరుపతిః స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ భవానీనగర్ సర్కిల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం ఉదయం ప్రారంభించారు. 16 ఎంఎన్ సి కంపెనీలు ఏడు వందల ఉద్యోగాలు కోసం జాబ్ మేళాలో ఇంటర్వూలు నిర్వహించి సెలక్ట్ అయిన యువతకు సాయంత్రం ఆఫర్ లెటర్స్ అందించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామి ఇచ్చారని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మెళాలను స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. తిరుపతిలో ఇప్పటి వరకు 14 మినీ జాబ్ మెళాలు నిర్వహించి 615మందికి ఉద్యోగాలను స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కల్పించిందని ఆయన తెలిపారు. తిరుపతిని విశాఖపట్నం, విజయవాడలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. యువత మెగా జాబ్ మెళాలో ఉద్యోగం లభించకపోతే నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాలని ఆయన కోరారు. అలాగే స్థోమతను బట్టి వ్యాపారం ప్రారంభించి కొనసాగిస్తే ఉద్యోగులకన్నా అధికమొత్తం పొందవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత జ్జానాన్ని పెంచుకుని కష్టపడితే విజయం ఖాయంగా లభిస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా కొత్త కంపెనీలను పెట్టించకపోగా ఉన్నవాటిని ఇతర రాష్ట్రాలకు వెళ్ళగొట్టారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ జిల్లా అధికారి లోకనాథం, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణా, బిజేపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, గీతం స్కూల్స్ యజమాని తమ్మినేని వెంకటేశ్వర రావు, జనసేన నాయకులు రాజా రెడ్డి, దేవర మనోహర్, ఆర్కాట్ కృష్ణప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.