మన న్యూస్ సింగరాయకొండ:-వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీవోలు, ఈపీఆర్డీవోలు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో నీటి సరఫరా, విద్యుత్, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, డ్రెయిన్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి మాట్లాడుతూ….వేసవి దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి. పాడైపోయిన మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ఏ ఒక్క గ్రామంలో నీటి సమస్య ఉండకూడదు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలి. సైడ్ కాలువలు, డ్రెయిన్లలో పూడిక తీసి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అన్ని గ్రామాల్లో ప్రతి నెలా 3 వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలి.అన్ని గ్రామాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు చేపట్టాం.
విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని మంత్రిడా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అన్నారు.