శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోష దాయకమని శంఖవరం మండల అధ్యక్షుడు పర్వత రాజబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక సగర కాలనీలో గల భగీరథ మహర్షి విగ్రహానికి పూలదండలు వేసి ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్వత రాజబాబు మాట్లాడుతూ,భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ముందుగా సగర కాలనీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే.. వారిని భగీరథునితో పోలుస్తారని, కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని కొనియాడుతారని అన్నారు.ప్రభుత్వం సగరులకు రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించాలని కోరారు. ఆర్థికంగా సామాజికంగా తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు పర్వత వివేక్, మాజీ ప్రజా ప్రతినిధి ములికి వెంకన్న, సగర సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.