గొల్లప్రోలు, మే 4 (మన న్యూస్):-గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో భాను సప్తమిని పురస్కరించుకుని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం సంయోగంతో ఏర్పడిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, పండిత బృందం, సేవాసమితి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు, పూజలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శరీర ఆరోగ్యానికి శుభదాయకమైన సూర్యారాధనలో భాగంగా త్రిచ, ఆరుణం, సౌర మంత్రాలతో పారాయణాలు జరిగాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొని సూర్య భగవానునికి అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవాసమితి ప్రతినిధులు, పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో, వేద మంత్రోచ్చారణలతో సాగిన ఈ పూజలు భక్తుల మనసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.