మన న్యూస్,తిరుపతిః- ఆర్టీసి బస్టాండ్ ను ఆనుకుని వెనుకవైపు తాళ్ళపాక లక్ష్మీనారాయణ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బుధవారం ఉదయం ప్రారంభించారు. మే డే సందర్భంగా ఆటో డ్రైవర్స్ కు బట్టలను ఆయన పంపిణీ చేశారు. బస్టాండ్ వచ్చి వెళ్ళే ప్రయాణికులకు, స్థానికులకు ఎండాకాలం దాహార్తిని తీర్చేందుకు ఆటో యూనియన్ చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. నగరంలో మున్సిపల్ కార్పోరేషన్ తో సహా పలు స్వచ్చంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేశాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సం సందర్భంగా ఆయన కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ళపాక దాము, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు దేవరాజులు, దుగ్గాణి జయరామ్, మల్లారపు దాము, డాక్టర్ కళ్యాణ్, తాళ్ళపాక చక్రీ తదితరలు పాల్గొన్నారు.