మనన్యూస్ బంగారుపాళ్యం ఏప్రిల్-29*పూతలపట్టు నియోజకవర్గం,బంగారుపాళ్యం మండలం కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. మంగళవారం ఉదయం బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన *"పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్"* స్ధానిక మండల నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషను శిక్షణ తరగతులను మండల అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళల ఆర్ధిక స్వావలంబనతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా బంగారుపాళ్యం మండలానికి దాదాపు 200 కుట్టు మిషన్లను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. 75 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల శ్రేయస్సు కోరి అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలు చేసే ఘనత ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబిగా మారితేనే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చేందుతుందని నమ్మిన చంద్రబాబు గారు మహిళల కోసం అనేక ఉపాధి అవకాశాలు తీసుకొస్తున్నట్లు తెలియజేశారు. ఇది కేవలం శిక్షణా తరగతుల మాత్రమే కాదు. "మహిళ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశంగా తీసుకోవాలని, మీరు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మీతో పాటు మరికొంతమంది ఉపాధి కల్పించే స్ధాయికి ప్రతి మహిళ ఎదగాలని ఆశిస్తున్నట్లు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి జనార్థన్ గౌడ్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్.పి. ధరణీ నాయుడు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్ మరియు మండల నాయకులు, అధికారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.