జగ్గంపేట మన న్యూస్ (అపురూప్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్బిఎన్ఎఫ్) ప్రకృతి వ్యవసాయం సాగు విధానాన్ని అందరూ ఆచరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో పాల్గొని రైతన్నలను చైతన్యపరిచారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల నేలతల్లిని నిర్జీవం చేస్తున్నామని, భూమిలో ఉండి పంటకు ఉపయోగపడే వానపాములు,అనేక రకాల మిత్ర జీవులు చనిపోవడం వల్ల నేల సహజ జీవం కోల్పోతుందని, రసాయనిక ఎరువులు పురుగు మందులతో పండించే పంటల వలన అందరికీ అనేక రకాల రోగాలు రావడం వ్యాధి నయం కోసం హాస్పటల్లో చేరి అప్పులు పాలవడం ప్రతి కుటుంబాల్లోనూ జరుగుతుందని భూమిని బలోపేతం చేయడానికి పంట దిగుబడి పెంచడానికి రసాయనిక ఎరువులు తగ్గించి, ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు చల్లడం ద్వారా 40నుండి50 రోజుల్లోనే భూమికి మంచి బలం ఆరోగ్యం చేకూర్చే సహజసిద్ధమైన ప్రకృతి ఎరువు తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడం జరుగుతుందని, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం పంటలకు వాడటం తద్వారా ఆరోగ్యకరమైన పంట పండించడానికి అవకాశం ఉంటుందని పాటంశెట్టి సూర్యచంద్ర రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను చైతన్య పరుస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సూర్యచంద్ర అభినందించారు