ఎన్‌హెచ్-16పై బరి తెగించిన ఆయిల్ మాఫియా
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆయిల్ ముఠా దుకాణాలు.ఎర్రవరం మొదలుకుని తుని రూరల్ వరకు హైవేపై పదుల సంఖ్యలో ఆయిల్ ముఠాలున్నాయి. వీరంతా కలిపి 26 దాకా దుకాణాలు నడుపుతున్నారు. నెలంతా కలిపి సుమారు రూ.1.50 కోట్ల టర్నోవర్ చేస్తారు. ముఖ్యంగా ప్రత్తిపాడు మండల పరిధిలో హైవేపై ప్రత్తిపాడు బైపాస్, ధర్మవరం శివారు, పాదాలమ్మ గుడి సమీపంలోను, కత్తిపూడి,మధ్య ఈ ముఠా వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా గడచిన కొన్నేళ్లుగా హైవే పక్కనే దుకాణాలు ఏర్పాటుచేసి యథేచ్ఛగా క్రయ విక్రయాలు చేస్తున్నారు. ప్రధానంగా హైవేపై ప్రయాణించే లారీ డ్రైవర్లతో కుమ్మక్కై వారి నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేస్తారు. అటు లారీ డ్రైవర్లు సైతం డబ్బుల కోసం బండిలో ఆయిల్‌ను ఈ ముఠాలకే విక్రయిస్తారు. ఇలా వందలాది లారీల్లో డీజిల్‌ను వారు పగలు, రాత్రి తేడా లేకుండా ఈ ముఠాలు తోడేస్తాయి. బయట బంకుల్లో లీటరు డీజిల్ ధర కంటే రూ.10 తక్కువకు లారీల నుంచి కొనుగోలు చేస్తాయి. ఈ డీజిల్‌పై లీటరుకు కొంత ధర తగ్గించి అదే హైవేపై వచ్చీపోయే స్థానిక లారీలతో పాటు హైవేపై ప్రయాణించే కార్లకు విక్రయిస్తుంటారు. ఇది కాకుండా కేవలం కాజేసిన డీజిల్‌ను ఈ ముఠాల వద్ద మాత్రమే కొనుగోలు చేసే లారీలు, కార్లు కూడా ఉంటాయి. ఇలా ఉదయం నుంచి తెల్లవారే వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొన్నేళ్లుగా సాగుతోంది. వ్యాపారంలో భాగంగా ముఠాలు హైవే పక్కన చిన్న షెడ్లు వేసి పరదాలు కడతారు. ఒక్కో దుకాణం ద్వారా నెలకు రూ.5లక్షల వరకు డీజిల్ వ్యాపారం జరుగుతుంది. హైవే పక్కన దర్జాగా సాగే ఆయిల్ ముఠా వ్యాపారం గురించి స్థానిక పోలీసుల దగ్గర నుంచి అధికార పార్టీ నేతల వరకు అందరికీ తెలుసు.కానీ తమ జోలికి రాకుండా సదరు ఆయిల్ ముఠాలు నెలవారీ మామూళ్లు పంపిస్తుంటారు. దీంతో ఆయిల్ ముఠా వ్యాపారం ఏ ఢోకా లేకుండా సాగిపోతోంది. ఆయిల్ ముఠా వ్యాపారం చీకటయ్యే సరికి మరింత పుంజు కుంటోంది. ఒకవైపు లారీల నుంచి డీజిల్ తీయడం.మరోపక్క హైవేపై నిలుచుని వచ్చీపోయే వాహనాలపై లైట్లను అదేపనిగా బ్లింక్ చేస్తాయి. ఇలా ఆగే వాహనాలకు ఆయిల్ విక్రయిస్తారు.