నర్వ ఏప్రిల్ 24:- మన న్యూస్ :-ధరణి తో సాధ్యం కాని ఎన్నో భూ సమస్యలకు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గత ధరణి చట్టం స్థానంలో ప్రభుత్వం కొత్తగా భూ భారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని వారు తెలిపారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా గురువారం మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ , నర్వ మండల కేంద్రాల్లోని రైతు వేదికలలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ధరణిలో ఉన్న సమస్యలను గుర్తించి ధరణి స్థానంలో రైతులకు మేలైన చట్టం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దుచేసి రైతు సంఘాలు, రెవెన్యూ అధికారులు, మేధావులతో చర్చలు జరిపి ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టాన్ని గత జనవరిలో రూపొందించిన ప్రభుత్వం కేవలం మూడు నెలల్లో రూల్స్ ను కూడా తీసుకొచ్చిందని తెలిపారు. గతంలో చట్టం తీసుకు రావడానికి 13 సంవత్సరాలు పట్టిందన్నారు. ఈ కొత్త చట్టం పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 17న మక్తల్ లోనూ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొత్త చట్టం లో 4, 5, 6, సెక్షన్లు రైతులకు ఉపయోగపడే ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పారు. అలాగే సాదా బైనామా ల పరిష్కారానికి కూడా కొత్త చట్టం లో ప్రత్యేక ప్రొవిజన్ ఉందని, మిషన్ మోడ్ లో భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. గతంలో అన్ని అధికారాలు కలెక్టర్ వద్దనే ఉండేవని, ఇప్పుడు తహాసిల్దార్, ఆర్డీఓ, రెవెన్యూ కలెక్టర్ స్థాయిలోనూ అధికారాలు ఉన్నాయన్నారు. పైలెట్ మండలంలో వచ్చిన భూ సమస్యలను మిషన్ మోడ్ లో పరిష్కారం చూపిస్తామని, ఆయా సమస్యల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుని జూన్ 2 తర్వాత జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి కొత్త చట్టం ప్రకారం పరిష్కారం చూపిస్తామన్నారు. మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… భూ భారతి చట్టాన్ని తీసుకురావడానికి 10 నెలలు అహర్నిశలు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కష్టపడ్డారని తెలిపారు. ధరణి చట్టంతో గత ప్రభుత్వం రైతులను తికమక పెట్టిందని, రైతుకు భూమికి ఉన్న బంధాన్ని తెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న భూ సమస్యలకు నేరుగా జిల్లా కలెక్టర్ వద్దకే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు తహాసిల్దార్ స్థాయిలోనే చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పారు. భూ భారతి చారిత్రాత్మక చట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టంలోని సెక్షన్లు రైతులందరూ తెలుసుకుని తహాసిల్దార్ కార్యాలయానికి వెళ్ళి తమ సమస్యలను ఆయా సెక్షన్ల కింద చేయాలని అధికారులను అడగాలని, మన సమస్యలకు అధికారులు నెల రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే నెల తరవాత ఆటోమేటిక్ గా పోర్టల్ లో సమస్య పరిస్కరించబడుతుందని తెలిపారు. రైతు జీవితం భూమితో, పాస్ బుక్ తో ముడి పడి ఉంటుందన్నారు. కానీ ధరణితో పార్ట్ బి పేరిట రైతుకు,పాస్ బుక్ మధ్య ఉన్న బంధాన్ని తెంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి భూతం హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాలకే కాదు నర్వ మండలానికి కూడా పట్టిందని ఎద్దేవా చేశారు. నర్వ మండలంలో ఎన్నో కుటుంబాలలో శుభ కార్యాలు ధరణి వల్ల నిలిచిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. రైతులు కొత్త చట్టం లోని సెక్షన్లపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఇకపై భూ సమస్యలతో ఏ రైతు కూడా ఇబ్బంది పడటానికి అవకాశమే లేకుండా సీఎం రేవంత్ రెడ్డి భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే నర్వ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి రహదారి సౌకర్యం కల్పించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు సదస్సులో బీసీ కాలనీ మహిళలు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కాగా నర్వ మండల కేంద్రంలోని రైతు వేదికలో సదస్సు ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు, రైతులు పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మ శాంతి కోసం రెండు నిముషాలు మౌనం పాటించి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయా సదస్సులలో ఊట్కూరు, నర్వ మండలాల తహాసిల్దార్లు చింత రవి, మల్లారెడ్డి, నర్వ ఎంపీడీవో శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నర్వ మండల వ్యవసాయాధికారి అఖిల, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.