మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 24:- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్థశ పట్టిందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. భవిష్యత్తులో కోవూరు నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయిలో తొలిర్యాంకు సాధించేలా చూడాలన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విపిఆర్ నివాసంలో ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులు.. ఆమె ఆశీసులు అందుకున్నారు. అలాగే ఇందుకూరుపేట మండలంలో 593 మార్కులతో తొలిస్థానం సాధించిన గుడి భార్గవ్ అనే విద్యార్థికి టిడిపి నాయకులు దాసరి విజయ్ తన భార్య జ్ఞాపకార్థం 25 వేల నగదు బహుమతిని ఎమ్మెల్యే చేతులమీదుగా అందించారు. అలాగే మండలానికి చెందిన టిడిపి నాయకులు సతీష్.. 591 మార్కులు సాధించిన నేహా పర్విన్కు సిగమాల పుల్లమ్మ జ్ఞాపకార్థం 10 వేల పురస్కారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందించి ప్రోత్సహించారు. ఇక అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఎమ్మెల్యే చేతుల మీదుగా 586 మార్కులు వచ్చిన నెల్లూరు హారికకు ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ 5 వేల రూపాయలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించి పురస్కారాలు అందించడం గొప్ప విషయమన్నారు. ఇంతబాగా చదువు చెబుతున్నందుకు ఉపాధ్యాయులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ట్రిపుల్ ఐటీల్లో సీటు సాధించేలా విద్యార్థులను గైడ్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.