మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 24 :- ఉన్నత చదువులు చదివిస్తామని వెల్లడి. 100 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్ విద్య పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 587 మార్కులు సాధించిన విద్యార్థిని గాయత్రిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గురువారం నెల్లూరులోని విపిఆర్ నివాసానికి వచ్చిన విద్యార్థిని.. ఈ సందర్భంగా ప్రశాంతమ్మను కలిశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు విద్యార్థినిని ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థిని ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాము భరిస్తామని, ఇంజినీరింగ్ చదవాలన్న విద్యార్థిని కోరికను నిజం చేస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ..ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆలోచనలకు నిదర్శనమైన విపిఆర్ విద్య పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం 29 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 100 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. దీనికి పాఠశాల సిబ్బంది ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వి.టి శ్రీనివాస్, విద్యార్థిని తల్లి ఝాన్సి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. వేమిరెడ్డి దంపతుల సహకారంతో తన కూతురు మంచి ఫలితాలు సాధించిందని, వారికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.