మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 23: - నిరుపేద విద్యార్థిని గాయత్రికి 587 మార్కులు. - 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మానసపుత్రిక, విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న విపిఆర్ విద్య పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100కు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో పి. గాయత్రి అనే విద్యార్థిని 600కు 587 మార్కులు సాధించి టాప్‌లో నిలిచింది. తర్వాత వి.వైష్ణవి 584 మార్కులు, వి.వర్ష 581 మార్కులు సాధించారు. పదో తరగతిలో ఫలితాల్లో మొత్తం 29 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..29 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో 27 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించడం విశేషం.
నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అందించేందుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కనుపర్తిపాడులో VPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016లో 'వి.పి.ఆర్ విద్య' పాఠశాల ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ వస్తున్నారు. పాఠశాలలో చదివే నిరుపేద పిల్లలకు అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్ యూనిఫాం, పుస్తకాలు, షూస్, బ్యాగ్స్, ఇతర వస్తువులు అన్నీ ఉచితంగానే ఇస్తారు. పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పోషకాలు కలిసిన భోజనాన్ని పిల్లలకు మధ్యాహ్నం ఉచితంగా పెడతారు. అలాగే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరును పిల్లలకు సమకూరుస్తున్నారు.