కడప జిల్లా: పోరుమామిళ్ల: మన న్యూస్: ఏప్రిల్ 24: జమ్ముకాశ్మీర్ పహల్గాం లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు.పలు ప్రాంతాల నుంచి వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యగా పేర్కొంటూ,ఈ దుశ్చర్య సంఘటనపై దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.సామాన్యులను,మిలట్రీ అధికారులను, సైన్యాన్ని, పర్యాటకులను ఇలా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారన్నారు. దేశ సమగ్రతను విచ్చిన్నం చేయడానికి కొంతమంది విచ్చిన్నకారులు, ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని, దేశమంతా ఒక్కటై ఉక్కు పిడికిలితో ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకిలించాలన్నారు. దాడిని నిర్ద్వంద్వంగా ప్రతి ఒక్కరూ ఖండిచాలని తెలిపారు. అమాయక పౌరులపై, ముఖ్యంగా పర్యాటకులపై దాడి చేయడం భయంకరమైనదని, క్షమించరానిదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని అండగా నిలవాలని , క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని, ఆయన ఆక్షాంక్షించారు. టెర్రరిస్టుల మారణకాండ ఎక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కోరారు.అలాగే ఈ ఘటనలోఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విశాఖ వాసి చంద్రమౌళిని, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావును ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసిందివారి మరణానికి సంతాపం తెలిపారు.