Mana News :- కేంద్ర ప్రభుత్వం- తమిళనాడు సర్కార్ మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా, ఈ వివాదంపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. చెన్నైలోని నందనం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి పేరుతో 4.80 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన ఆడిటోరియం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. 'పెరియార్, గ్రాండ్‌మాస్టర్ అన్నా, ముత్తమిళర్ కళైంజర్ తో పాటు మన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సహా పలువురు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. 1986లో హిందీకి వ్యతిరేకంగా కరుణానిధి చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ గుర్తిండి పోయిందని చెప్పుకొచ్చారు. అయితే, 1956లో హిందీకి వ్యతిరేకంగా విద్యార్థుల చేసిన నిరసనలే తమిళ సంస్కృతిని కాపాడాయని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. కాగా, NEET, NEPలతో తమిళ విద్య వ్యవస్థను దెబ్బ తీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. వీటి ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దుతోంది.. ఇది హిందీకి వ్యతిరేకంగా పోరాటం కేవలం భాషపై పోరాటం మాత్రమే కాదు.. తమిళ సంస్కృతిని రక్షించడానికి ఒక జాతి పోరాటం.. ఈ పోరాటం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.