మనన్యూస్,పిఠాపురం:మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందార్లు నిర్ణయించారు. అలాగే దళితులు అగ్రవర్ణాల నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు. కోడి మాంసం అమ్మె ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సి కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య వచ్చి 78 సంవత్సరాలయినా తమపై ఇంకా వివక్షత కొనసాగడంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పిఠాపురం మండలంలోని మల్లంలో వెలిశెట్టి జల్లిబాబు ఇంటికి ఈ నెల 16 న గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్ (37) కరెంటు పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.అతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై 17న గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దళితులంతా ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఇరు వర్గాల సమక్షంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. ఈ నేపథ్యంలో దళితులు ఐక్యంగా ఉండడం, వారి హక్కుల కోసం నిలబడటం అగ్రవర్ణాలకు కంటగింపుగా మారింది. దళితులను ఇలాగే వదిలేస్తే వాళ్లు మరింత రెచ్చిపోతారని గత రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు పెత్తందార్లు సమావేశం పెట్టుకుని పెత్తందారులు తలుచుకుంటే ఏవిధంగా ఉంటుందో దళితులకు తెలియజేయాలని సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.కొందరు పెద్దలు చేసిన నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, అలాగే పాలు పోసే వ్యక్తులు, హోటల్స్ నిర్వాహకులు కూడా పాలు టిఫిన్ ఇచ్చేది లేదని ఈ సందర్భంగా దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాల నివసించే ప్రాంతంలో చేపలు అమ్మకం వగైరా నిలిపివేయాలని హుకుం జారీ చేశారు.
ఆర్డీవో విచారణ
సాంఘిక బహిష్కరణ అంశంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కాకినాడ ఆర్టీవో ఎస్. మల్లిబాబు, పిఠాపురం సీఐ జి. శ్రీనివాస్, ఎస్ఐ జాన్ బాషా దళిత కాలనీలో బాధితులను విచారించారు. ఈ సందర్భంగా పలువురు తాము ఎదుర్కొన్న వివక్షతను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా
కాల్దరి భాస్కరరావు మాట్లాడుతూ గ్రామంలో గత ఐదు సంవత్సరాలు నుంచి చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానన్నారు. ఆదివారం గ్రామంలో యధావిధిగా చేపలు ఆమ్మేందుకు ప్రయత్నం చేయగా గ్రామానికి చెందిన బుర్రా రాంబాబు,మెడిది రాజారావు తన వద్ద ఎవరూ చేపలు కొనవద్దని చెప్పినట్లు వివరించారు. కలగపూడి ఆమోష్ మాట్లాడుతూ రోజూ మాదిరిగానే ఆదివారం కూడా గ్రామంలోని బుర్రా నాని, బుర్రా మణిలకు చెందిన రెండు హోటళ్లలో టిఫిన్ కోసం వెళ్లగా మీకు విక్రయించమని బదులిచ్చారని అధికారులకు తెలిపారు.ఆలపాటి చంద్రరావు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ప్రాంతంలో టీ తాగేందుకు గ్రామంలోని మలిరెడ్డి రాంబాబు దుకాణం వద్దకు వెళుతుంటానని, ఆదివారం కూడా అదే మాదిరిగా టీ కొట్టుకు వెళ్ళగా మా పెద్దలు తెలిపారని ఈరోజు మీక టీ ఇవ్వమని చెప్పారన్నారు. కాల్దారి శ్రీను మాట్లాడుతూ
చల్లా వెంకటరమణ పాల కేంద్రం వద్దకు పాలు తీసుకునేందుకు వెళ్లగా ఈరోజు మీకు పాలు ఇవ్వమని తెలిపారన్నారు. దళితులు చెప్పిన వివరాలను ఆర్డీవో నమోదు చేసుకున్నారు. అనంతరం గ్రామంలో సామరస్య వాతావరణం కలిగి ఉండాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలతో ఆయన చర్చలు జరిపారు. దళితుల సాంఘిక బహిష్కరణ చట్టవిరుద్ధమని, ఎవరైనా దళితుల పట్ల వివక్షత చూపితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంఘిక బహిష్కరణ ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుని శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం ఆయన విద్యుత్ షాక్ కు గురై మరణించిన బాధితుని కుటుంబాన్ని పరామర్శించారు.
సాంఘిక బహిష్కరణ సరికాదు పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులపై గ్రామానికి చెందిన కొందరు పెత్తందారులు సాంఘిక బహిష్కరణ చేయడం సరికాదని అటువంటి వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి. సురేష్ కుమార్, కె.సింహాచలం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దళితుల ఐక్యతను చూసి ఓర్వలేక అగ్రకుల, భూస్వామ్య మనస్తత్వంతో గ్రామంలో పెత్తందారులు దళితులపై ఇటువంటి వివక్షతను చూపుతున్నారన్నారు. అగ్రవర్ణాల నుండి, గ్రామంలో పెత్తందారుల నుండి దళితులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. కాకినాడ జిల్లా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఎస్సీ కాలనీలో పర్యటించాలని వారు డిమాండ్ చేసారు. దళితులను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన అగ్ర కుల పెత్తందారులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. కుల వివక్ష పాటించడం, సాంఘిక బహిష్కరణకు గురి చేయడం తీవ్రమైన నేరాలుగా పరిగణించాలన్నారు.గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.