పినపాక, మన న్యూస్ :- కరకగూడెం: వక్ఫ్ బోర్డులోని ప్రతిపాదిత సవరణలపై ముస్లిం సమాజం నుంచి రోజు రోజుకు ఆందోళన కార్యక్రమాలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో వక్ఫ్ బోర్డులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సవరణలను వ్యతిరేకిస్తూ శనివారం కరకగూడెం జామా మస్జీద్ నుండి కరకగూడెం తహసీల్దార్ కార్యాలయం వరకు మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ ఆస్తుల పవిత్రతను కాపాడాలని శాంతియుత నిరసన తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించార.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి చెందిన పవిత్రమైన ధార్మిక మరియు సామాజిక సంపదని వీటిని పరిరక్షించడం వాటి యొక్క అసలు లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించడం వక్ఫ్ బోర్డు యొక్క ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించబడిన కొన్ని సవరణలు వక్ఫ్ బోర్డు యొక్క స్వయంప్రతిపత్తిని తగ్గించడమే కాకుండా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ప్రభుత్వ జోక్యానికి అవకాశం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు.అలాగే ముస్లిం సమాజం వక్ఫ్ ఆస్తుల యొక్క పవిత్రతను వాటి యొక్క చారిత్రక ప్రాముఖ్యతను ఎంతో గౌరవిస్తుందని ఈ ఆస్తులు తరతరాలుగా మా మతపరమైన సామాజిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతున్నాయని వివరించారు.వీటి నిర్వహణలో ఎటువంటి మార్పులు చేసినా అది ముస్లిం సమాజం యొక్క మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని కావున వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలనీ లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.అలాగే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.సీపీఎం మండల కమిటీ కన్వీనర్ కొమరం కాంతారావు ముస్లింల ర్యాలీకి మద్దతు తెలిపారు.అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వట్టం కాంతయ్యకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.షేక్ సోందు పాషా,సయ్యద్ సజ్జాద్ హుస్సేన్,పఠాన్ యాకుబ్ ఖాన్,అక్బర్ ఖాన్,రఫీ,ఖలీల్,ఆరిఫ్,షేక్ యాకుబ్,గయాస్,సయ్యద్ అన్వర్,షేక్ అజ్జు,ఇలియాజ్,రియాజ్,ఎండీ ఖయ్యుమ్,పలు మస్జీద్ ల మౌలిసాబ్ లు,మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.