ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి: నవంబర్ 16
ఏలేశ్వరం మండలంలో చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులు,రోడ్డున పడ్డారు. కర్మాగారం వద్ద కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయమై బోర్డు మెంబర్ రమేష్ కు పలువురు కార్మికులు ఫోన్ చేయగా ఈనెల 23 వ తేదీన వచ్చి అప్పటివరకు రావలసిన వేతనాలు చెల్లిస్తామని, ఇతర బకాయిలను చెల్లిస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. రాత్రికి రాత్రి కర్మాగారం మూసివేస్తే మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు తాము పని చేసిన కాలంలో సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించే కొంతమంది కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఐక్యంగా పోరాడకపోతే 300 కుటుంబాలు పైగా నష్టపోతారని వారిలో వారు చర్చించుకుంటున్నారు. కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ విషయమై కార్మికులకు న్యాయం చేయవలసి ఉంది.