మనన్యూస్,శేరిలింగంపల్లి:జోనల్ కార్యాలయంలో గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి , జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా శాఖల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. అందుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రజా సమస్యల పరిష్కారానికి పలు విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. నానాటికీ పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ వాహనాల వినియోగం ప్రజా సౌకర్యాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా కృషి చేయటం ద్వారా మరిన్ని సత్ఫలితాలు నమోదవుతాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను వేగంగా పరిష్కరించి అభివృద్ధి పనులను మరింతగా వేగవంతం చేయాలన్నారు. రాబోయే వర్షాకాలంలోపు నాలల విస్తరణ పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని,నాలల పూడికతీత పనులు వేగవంతం చేయాలని అన్నారు. రహదారుల విస్తరణ, కూడళ్ల అభివృద్ధి, డైనేజీ సమస్యలు, రహదారులపై గుంతలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని , సమన్వయం లోపిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పీఏసీ ఛైర్మన్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్ పాత్ల ఆక్రమణలను తొలగించాలని,పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని,చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృదిని చేపట్టాలని సూచించారు. గంగారం హనుమాన్ దేవాలయం నుంచి అపర్ణ వరకు వంద ఫీట్ల రోడ్డు, శ్రీదేవీ థియేటర్ రహదారి విస్తరణ సహా లింక్ రహదారుల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళతామని , అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని పీఏసీ ఛైర్మన్ గాంధీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ జికెడి ప్రసాద్, ఈఈ ఇంద్ర బాయి ,డీఈలు దుర్గ ప్రసాద్, విశాలాక్షి, శ్రీదేవి, ఏఈ లు జగదీష్, ప్రశాంత్, రషీద్, ప్రతాప్, సంతోష్ , సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.