మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం మధ్యాహ్నం మరికల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉంటే నేరుగా ఆఫీస్ లో సంప్రదించవచ్చని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ లో రోజువారిగా నమోదవుతున్న ఫిర్యాదులు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖ అత్యంత బాధ్యతాయుతమైన వ్యవస్థ అని ప్రతి ఒక్కరు అంకితాభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. కోర్టులో నిందితులకు శిక్షలు పడేలా భౌతిక సాక్షంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని తెలియజేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దొంగతనాల నిర్మూలన కొరకు నిఘా ఏర్పాటు చేయాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. రహదారి వెంట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలని తెలియజేశారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పరచాలి అని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై, 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు తీసుకొచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రతా, భరోసా కల్పించే విధంగా పోలీస్ వ్యవస్థ ఉండాలని ప్రజలు ఎటువంటి సమాచారమైనా డయల్ - 100 ద్వారా తెలుపవచ్చు అని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, రౌడీ షీటర్స్, కేడీలు, సస్పెక్ట్ ఇళ్లను తనిఖీ చేయాలని, పాయింట్ బుక్స్ ను తనిఖీ చేయాలని గ్రామాలలో ప్రధాన కూడళ్ల వద్ద విజిబుల్ పోలీసింగ్ ఉండాలని నేరాల నివారణకు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్ ఐ రాము, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.