సింగరాయకొండ మండల రిపోర్టర్ మన న్యూస్:-ప్రకాశం జిల్లా తీరప్రాంతం సింగరాయకొండలో పూర్వంలో నెలకొల్పిన 30 పడకల ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మళ్లీ పునరుద్ధరించి, 50 పడకల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ స్థాయికి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీనియర్ జర్నలిస్ట్ డా. పెట్లూరి వెంకటేశ్వరరావు ఒక వినతిపత్రం అందజేశారు.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గౌ. సత్యకుమార్ యాదవ్ మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గౌ. డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అందజేసిన ఈ వినతిలో ఆయన పేర్కొనదగ్గ అంశాలు విశేషంగా గమనించదగినవి.తీర ప్రాంత ప్రజలకు వైద్య సేవల కొరత: సింగరాయకొండ ఒక వెనుకబడిన తీరప్రాంత గ్రామం. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ, ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య వసతులు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదు. 2006లో నాబార్డ్ నిధులతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రి 2009లో ప్రారంభమై ప్రజలకు విస్తృత సేవలు అందించినా, గత ప్రభుత్వ పాలనలో అది సర్వసాధారణ పీహెచ్సీగా మార్చడం వల్ల ప్రజలు తిరిగి ఒంగోలు, కందుకూరు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.వైద్య సదుపాయాల నిరుపయోగం: ఈ ఆసుపత్రిలో ఉన్న ప్రసూతి విభాగం, ఆపరేషన్ థియేటర్, ప్రత్యేక బెడ్లు, దంత చికిత్స వసతులు వంటి వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డా. వెంకటేశ్వరరావు కోరారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో క్లినికల్ ల్యాబ్ పనులు ప్రారంభమయ్యాయి. అలాంటి స్థితిలో ఈ ఆసుపత్రిని మరింత విస్తరించి 50 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలన్నారు. అయుష్మాన్ భారత్ దిశగా అడుగులు: ప్రధాని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత వైద్య వసతులు కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తున్న తరుణంలో, సింగరాయకొండ ఆసుపత్రిని పునరుద్ధరించి పూర్తిస్థాయి సేవలు అందించాల్సిన అవసరం ఉందని డా. వెంకటేశ్వరరావు తన వినతిలో పేర్కొన్నారు.ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, జిల్లా అధికారులు సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సింగరాయకొండ ప్రజలు ఆశిస్తున్నారు.