మన న్యూస్, తిరుపతి:నవ సమాజ నిర్మాత, కలియుగ వైతాళికుడు సమాజంలోని స్త్రీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, విద్య కోసం నిరంతరం కృషిచేసి సమాజ సేవలోనే అసువులు బాసిన మహాత్ముడు జ్యోతిరావు పూలేకి భారత ప్రభుత్వం దేశంలోని సర్వోన్నతమైన బిరుదు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఏసి ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు టి.గోపాల్ డిమాండ్ చేసారు. మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలోని బాలాజీ కాలనీలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వందలాదిమంది సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, మేధావులు, వివిధ పార్టీల నాయకులు మహాత్మ పూలేకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య తరఫున వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్, బీసీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్ట భాస్కర్ యాదవ్, జాతీయ మేధావుల ఫోరం కన్వీనర్ డాక్టర్ వెంకటనారాయణ, జాతీయ బీసీ విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా బర్త్డే కేకు కట్ చేసారు.ఈ సందర్భంగాటి గోపాల్ మాట్లాడుతూ దేశంలో ఎంతోమందికి భారతరత్న ఇచ్చారని 18వ శతాబ్దంలోనే సామాజిక విప్లవం తెచ్చి నవ సమాజ నిర్మాణం కోసం జీవితాన్ని అంకితం చేసి, బాల్య వివాహాల అరికట్టి, వితంతు పునర్వివాహాలు జరిపి, అనాధలు, ఆర్తుల కోసం సత్యశోధక సమాజాన్ని స్థాపించి నవ సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలేకి భారతరత్న ఇవ్వడం ఎంతైనా అవసరమని అన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలేకి విద్యను నేర్పించి భారత దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆమె ద్వారా బాలికలకు మహిళలకు విద్య నేర్పించి సామాజిక విప్లవాన్ని తెచ్చిన మహోన్నతుడని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల చైతన్యం కోసం అభ్యున్నతి కోసం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి మానవ విలువలు పెంపొందించిన మహనీయుడని చెప్పారు. ఈకార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.