మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల కేంద్రంలోని రామాలయంలో మంగళ వాయిద్యాలు, పచ్చని చలువ పందిళ్ళు, వేద మంత్రోచ్ఛారణల నడుమ పుణ్య ముహూర్తం అభిజిత్ లగ్నమందు సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణాన్ని ఆలయ అర్చకులు వినోద్, ఆలయ వ్యవస్థాపకులు, రామాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎర్ర ప్రగడ రామమూర్తి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు బెల్లం పానకం, తీర్థప్రసాదాలను అందచేయడమే కాకుండా రామాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల వద్ద చందాలను స్వీకరించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీతారాముల వారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాల్లో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ భక్తులను ఉద్దేశించి ఆలయ అర్చకులు మాట్లాడుతూ అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు కర్ణాటక రాశిలో జన్మించగా శ్రీరామ నవమిని జరుపుకుంటామని అటువంటి పవిత్ర దినాన భక్తి శ్రద్ధలతో సీతారాముల వారిని పూజించే ప్రతి ఒక్క భక్తుడికి కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని, సీతారాముల కళ్యాణం జరిపించిన,రామచంద్ర మూర్తిని పూజించిన సమస్త అభీష్టములు నెరవేరుతాయి అని అన్నారు.అన్నదాన కార్యక్రమానికి, సీతారాముల వారి కళ్యాణానికి సహకరించి తమ వంతు విరాళాలను అందించిన దాతలు అందరికీ ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలను తెలపడం జరిగింది.