Mana News :- ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీ అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఏపీలో డ్రోన్ కార్పొరేషనను ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. అలాగే రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించాలని నిర్ణయించారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని డీఎల్ పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు కూడా ఆమోదం తెలిపింది. బార్ లైసెన్స్ ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. అలాగే యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అలాగే ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా మంత్రులు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు ఇతర నిర్ణయాలు కూడా ఈ భేటీలో తీసుకున్నారు.