Mana News :-దిల్లీ: వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. తొలుత దీని (Waqf Bill)పై సభలో చర్చ నిర్వహించి, అనంతరం ఓటింగ్ జరపనున్నారు. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ (Parliament)లో కూటముల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..!లోక్సభలో..ఈ బిల్లు లోక్సభ (Loksabha)లో గట్టెక్కాలంటే భాజపా (BJP)కు సాధారణ మెజారిటీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం సభలో భాజపాకు సొంతంగా 240 మంది ఎంపీలు ఉన్నారు. దాని మిత్రపక్షాలైన తెదేపాకు 16, జేడీయూకు 12 మంది సభ్యులున్నారు. ఇక, ఎల్జేపీ(రామ్ విలాస్)కు ఐదుగురు, ఆర్ఎల్డీకి ఇద్దరు, శివసేన (శిందే)కు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తంగా భాజపాకు 282 మంది ఎంపీల బలం ఉంది. ఉభయ సభల్లోనూ బిల్లుకు మద్దతివ్వాలని ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇక, ఇతర చిన్న పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తే తమకు 295 ఓట్లు అనుకూలంగా వస్తాయని ఎన్డీయే భావిస్తోంది. దీంతో సునాయాసంగానే బిల్లును ఆమోదించుకోవచ్చని అధికార పార్టీ చూస్తోంది. ఇక, కాంగ్రెస్ (Congress), దాని మిత్రపక్షాలకు కలిపి లోక్సభలో 234 మంది సభ్యులున్నారు. ఇప్పటికే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు మంగళవారం పార్లమెంటు హౌస్లో ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ, ఎన్సీపీ (ఎస్పీ), టీఎంసీ, ఆప్, డీఎంకే, వామపక్షాల నేతలు హాజరయ్యారు. వీరంతా బిల్లుపై చర్చలో క్రియాశీలంగా పాల్గొంటూనే వ్యతిరేకిస్తూ ఓటేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే, బిజు జనతాదళ్ వంటి కొన్ని పార్టీలు తటస్థంగా ఉన్నాయి. ఆ పార్టీలు ఎటు ఓటు వేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా సరే.. లోక్సభలో అధికార ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నందున ప్రభుత్వానికి ఏ ఇబ్బంది ఎదురుకాదు. రాజ్యసభలో ఇలా.. అటు రాజ్యసభ (Rajya Sabha)లోనూ భాజపాకు స్వల్ప ఆధిక్యం ఉంది. 245 మంది సభ్యులున్న ఎగువ సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం భాజపాకు సొంతంగా 98 మంది ఎంపీలు ఉన్నారు. మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే సంఖ్యాబలం 125గా ఉంది. ఈ వక్ఫ్ సవరణ బిల్లు గురువారం పెద్దల సభకు రానుంది.