మనన్యూస్,గొల్లప్రోలు:మండలం చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు 17వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 12వ అదనపు జడ్జి ఏ.వాసంతి, బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ఫౌండర్ బాదం బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బుర్ర అనుబాబు మాట్లాడుతూ కళాశాల ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తి అయ్యిందని, దేశం నలుమూలల తమ విద్యార్థులు ఇంజనీరింగ్ రంగంలో సేవలు అందించడం తమకెంతో గర్వకారణమని తెలియజేశారు. అనంతరం జడ్జి ఏ.వాసంతి మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉన్నత ఆశయం ఉండాలని, సమాజంలో చదువుతూనే గుర్తింపు గౌరవం లభిస్తాయని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి సభ్య సమాజంలో మెలగాలని సూచించారు.అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు, వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లను,మెడల్స్ ను అందించారు.అనంతరం పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ, డైరెక్టర్ అఖిలేష్, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శ్రీనివాసరావు, డాక్టర్ వైవిఎన్ రాజశేఖర్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.