మనన్యూస్,నారాయణ పేట:ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడటం జరుగుతుంది. యువత బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆలాంటి వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు జరుగుతుందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. మరియు వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది అని తెలిపారు. కావున యువత ఆలాంటి వాటికి దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు. ఐ పీ ఎల్
క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని, అంతేకాక బెట్టింగ్ నిర్వహించే వారిపై కూడా పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని ఎస్పీ తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల పై ప్రవర్తన నిఘా ఏర్పాటు చేయాలని పిల్లలు ప్రతి రోజూ వారు చేస్తున్న పనుల గురించి ఆరా తియ్యాలని తెలిపారు. క్రీకెట్ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత పిల్లల్లో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని ఎడల మీ డబ్బులు, పిల్లల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది అని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్స్ అనేవి చట్టారీత్యా నేరమని అట్టి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
యువకులు క్రికెట్ బెట్టింగ్ మాయలో పడవద్దని జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడం కూడా అత్యంత ప్రమాదకరం, నేరం అని వినోదం కొరకు ఆడే ఆటను వినోదముగానే చూడాలనీ, అంతే కాని ఇలాంటి వాటిలో ఇరుక్కొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. క్రికెట్ బెట్టింగ్, ప్లేయింగ్ కార్డ్స్, బెట్టింగ్ యాప్స్ పట్ల, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.