Mana News , హైదరాబాద్ : తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు)గడువును మరో మూడునెలల పాటు ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తోంది.గతేడాది డిసెంబర్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రాబోయే మూడు నెలల కాలానికి గడువు పొడిగించగా ఈ నెలతో పూర్తి కాబోతున్నది. అయితే జర్నలిస్టుల అక్రిడిటేషన్ జారీకి విధివిధానాల రూపకల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవలే ఐ అండ్ పీఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి నివేదిక ఇవ్వగా సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదంతో కొత్త అక్రిడిటేషన్ కోసం మరో పదిరోజుల్లో మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ఆలస్యం అయితే మరో మూడు నెలల పాటు ప్రస్తుత కార్డులు కొనసాగనున్నాయి.